- కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి
హైదరాబాద్, వెలుగు: ప్రధాని మోదీ నాయకత్వంలో దేశీయ మైనింగ్ రంగం గ్లోబల్ స్థాయికి విస్తరిస్తోందని, మారుతున్న కాలానికి అనుగుణంగా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) సరికొత్త సంస్కరణలతో అంతర్జాతీయ గుర్తింపు సాధించాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్ నాగోల్‌లోని జీఎస్ఐ శిక్షణ సంస్థలో నూతనంగా నిర్మించిన అంతర్జాతీయ హాస్టల్ కాంప్లెక్స్, అడ్వాన్స్డ్ జియోఫిజికల్ ల్యాబ్, కర్మయోగి డిజిటల్ స్టూడియోలను ఆయన మంగళవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. 176 ఏండ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన జీఎస్ఐ, 50 ఏండ్లు పూర్తి చేసుకున్న జీఎస్ఐ-టీఐ సంస్థలు తమ అసలు సామర్థ్యాన్ని చాటుతూ, దేశ భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా వ్యూహాత్మకంగా మారాలని స్పష్టం చేశారు. దేశంలో 2014 నుంచి ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 4,373 మైనింగ్ ఎక్స్‌ప్లోరేషన్ ప్రాజెక్టులు పూర్తయ్యాయని కిషన్ రెడ్డి తెలిపారు. వీటిలో 1,724 క్రిటికల్ మినరల్స్, 656 అరుదైన ఖనిజాల మైనింగ్ బ్లాక్‌లు ఉన్నాయని చెప్పారు. నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్ ద్వారా ఖనిజాల అన్వేషణకు నూతన వేగం లభించిందని, ఈ ఆర్థిక సంవత్సరంలోనే మరో 300 ప్రాజెక్టులపై జీఎస్ఐ పనిచేస్తోందని పేర్కొన్నారు.
రాష్ట్రాలవారీగా యాక్షన్ ప్లాన్లు
ఖనిజాల పరిశోధనల్లో ఏఐ, మెషీన్ లెర్నింగ్, రిమోట్ సెన్సింగ్ వంటి అత్యాధునిక టెక్నాలజీల వినియోగాన్ని పెంచాలని, సైంటిస్టులకు వీటిపై నిరంతరం శిక్షణ ఇవ్వాలని సూచించారు. జీఎస్ఐ-టీఐని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా తీర్చిదిద్ది లిథియం, గ్రాఫైట్, కోబాల్ట్ వంటి వ్యూహాత్మక ఖనిజాల అన్వేషణపై ప్రత్యేక శిక్షణ ఇవ్వాలన్నారు. గోవా మైనింగ్ మంత్రుల సదస్సు తీర్మానాల మేరకు.. ప్రతి రాష్ట్రానికి ఉన్న సహజ వనరుల ఆధారంగా రాష్ట్రాలవారీగా ప్రత్యేక యాక్షన్ ప్లాన్లు రూపొందించాలని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
